హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ రేట్లు పెరిగినయ్ మియాపూర్ టూ ఎల్బీనగర్ ఎంతంటే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మెట్రో రైలు ఛార్జీల పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇక నుంచి కనిష్ట ధర 12 రూపాయలు కాగా గరిష్ట ధర 75 రూపాయలు. ఛార్జీల పెంపుతో 200 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని హైదరాబాద్ మెట్రో అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రయాణికులకు రాయితీలు తొలగించారు. టాయిలెట్స్, పార్కింగ్లపై కూడా ఫీజుల వసూళ్లు చేస్తున్నారు.
ఆర్థిక భారంతోనే టికెట్ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించారు. కనిష్టంగా టికెట్ ధర 10 రూపాయలు ఉండగా, ఇవాల్టి నుంచి రూ.12కు, గరిష్ట ధర 60 రూపాయలు ఉండగా, రూ. 75కు పెరిగింది. అంటే మియాపూర్ టూ ఎల్బీనగర్ వెళ్లాలన్నా, నాగోల్ టూ రాయదుర్గ్ వెళ్లాలన్నా మెట్రో టికెట్పై 75 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. కనిష్ట ధరలో 20 శాతం, గరిష్ట ధరలో 25 శాతం పెంచారు. గతంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా మెట్రో టికెట్ల రేట్లను పెంచారు. అయితే మెట్రో తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం అవుతోంది.
ఒక్కసారిగా 20 నుంచి 25 శాతం టికెట్ ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మెట్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 9న బెంగళూరు నమ్మ మెట్రో ధరలు పెరిగాయి. గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.90కి పెరిగింది. కానీ ప్రజల నిరసనల తర్వాత ఫిబ్రవరి 14 నుంచి కొన్ని రూట్‌లలో గరిష్ట పెంపును 71శాతానికి తగ్గించారు. అయితే ధరల పెంపుతో బెంగళూరులో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 8.2 లక్షల నుంచి 7.1 లక్షలకు(13శాతం) పడిపోయింది.