భారత్ ప్రతినిధి : దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 12కు ఊహించని షాక్ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సమీపంలోని బిడదిలో ఉన్న జాలీవుడ్ స్టూడియోస్ & అడ్వెంచర్స్ లో ఉన్న షో యొక్క ప్రధాన హౌస్‌ను కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) అధికారులు అధికారికంగా సీజ్ చేశారు. పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ కఠిన చర్య తీసుకున్నారు.
రాత్రికి రాత్రే సీక్రెట్ ఆపరేషన్...
బిగ్ బాస్ హౌస్ ను అధికారులు సీజ్ చేసిన వెంటనే, రామనగర జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. సెట్‌లో ఉన్న మొత్తం 17 మంది కంటెస్టెంట్లు , సిబ్బందిని హుటాహుటిన తరలించారు. మీడియాకు, బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా ఉండేందుకు, అర్ధరాత్రి సమయంలో, అత్యంత గోప్యత నడుమ ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ కన్నడనాట తీవ్ర చర్చనీయాశంమైంది. అటు బిగ్ బాస్ హౌస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
రిసార్ట్ కు కంటెస్టెంట్ల తరలింపు...
మీడియా కథనాల ప్రకారం కంటెస్టెంట్లను అదే పారిశ్రామిక జోన్‌లో ఉన్న లగ్జరీ రిసార్ట్ అయిన ఈగల్‌టన్ గోల్ఫ్ రిసార్ట్‌కు తరలించారు. అత్యంత రహస్యంగా ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది. ఏకంగా రెండు వేర్వేరు దారుల్లో వారిని వాహనాల్లో షిఫ్ట్ చేశారు. రిసార్ట్‌లో కూడా బిగ్ బాస్ నిబంధనలు యధావిధిగా అమలవుతున్నాయి. అంటే, మొబైల్ ఫోన్లు, టీవీలు , బయటి కమ్యూనికేషన్ వంటి వారిటి పూర్తిగా నిషేధం విధించారు.
నియమాల ఉల్లంఘనే కారణం...
బిగ్ బాస్ సెట్ సీజ్ కావడానికి ప్రధాన కారణం పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అని అధికారులు తేల్చిచెప్పారు. ఈ సెట్‌కు కాలుష్య నియంత్రణ చట్ట నిబంధనలు పాటించడంలేదని అధికారులు గుర్తించారు. ఆవరణలో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ (STP) పనిచేయడం లేదు. శుద్ధి చేయని వ్యర్థ జలాన్ని నేరుగా డ్రైనేజిలోకి వదిలివేస్తున్నారు. అంతేకాక, వ్యర్థాలను వేరుచేసే పద్ధతులు సరిగా పాటించడం లేదని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. అటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే సైతం ఈ చర్యను సమర్థించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు.గతంలో ఎన్ని నోటీసులు ఇచ్చినా నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో చట్ట ప్రకారం చర్య తీసుకోవడం తప్పలేదని స్పష్టం చేశారు.
సీజన్ 12 భవితవ్యం ఏమిటి?
ప్రస్తుతానికి, బిగ్ బాస్ కన్నడ షో ముందుగా షూట్ చేసిన కంటెంట్‌తో యధావిధిగా ప్రసారమవుతోంది. అయితే, ప్రధాన హౌస్ సీజ్ కావడంతో షో యొక్క భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. నిర్వాహకులు ఈ వ్యవహారంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సెట్ సీల్‌ను ఎత్తివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు వస్తే తప్ప షో తిరిగి లైన్‌లో పడటం కష్టంగా మారింది. న్యాయపరమైన సవాళ్లు, లాజిస్టికల్ ఇబ్బందుల నేపథ్యంలో, ఒకవేళ కోర్టు ప్రక్రియ ఆలస్యమైతే లేదా అనుకూలించకపోతే, కన్నడ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సంక్షోభం నుంచి షో ఎలా బయటపడుతుందో చూడాలి మరి.