భారత్ ప్రతినిధి : ఎక్కువ డబ్బులు పెట్టి ప్రీమియం పెట్రోల్ కొంటున్నాం అందులో ఇథనాల్ కలపరు కదా అని చాలా మంది అనుకుంటారు. అందులో ఎక్కువ ధర పెడుతున్నాం కాబట్టి ప్రీమియం పెట్రోల్ చాలా స్వచ్ఛంగా ఉంటుందని, ఇథనాల్ అసలు ఉండదని భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. సాధారణ పెట్రోల్‌తో పాటు చాలా వరకు ప్రీమియం పెట్రోల్స్‌లో కూడా ఇథనాల్ కలుపుతున్నారు. ఈ రెండింటికి మధ్య అసలు తేడా ఏమిటో ఇక్కడ చూద్దామా.
1. అన్ని ప్రీమియం పెట్రోల్స్‌లో
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, భారతదేశంలో దొరికే సాధారణ పెట్రోల్‌లో 20% (E20) ఇథనాల్ కలుపుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనే చాలా ప్రీమియం పెట్రోల్స్‌లో కూడా ఇదే 20% ఇథనాల్ ఉంటోంది. ఇండియన్ ఆయిల్ XP95, భారత్ పెట్రోలియం స్పీడ్ 97, హెచ్‌పీ పవర్ 95, పవర్ 99, అలాగే షెల్ వి-పవర్ పెట్రోల్స్‌లో కూడా 20% ఇథనాల్ కలుపుతున్నారు.
2. మరి ప్రీమియం పెట్రోల్ ధర
ఈ ప్రీమియం పెట్రోల్స్‌లో ఇథనాల్ శాతం తగ్గదు. మరి ధర ఎందుకు ఎక్కువంటే వాటిలో ఉండే 'ఆక్టేన్ రేటింగ్' చాలా ఎక్కువగా ఉంటుంది. ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటే ఇంజిన్ పర్ఫార్మెన్న్ చాలా స్మూత్ గా సాగుతుంది, ఇంజిన్ నుంచి వచ్చే హార్డ్ సౌండ్ తగ్గుతుంది. అంటే మనం ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నది ఇథనాల్ తక్కువగా ఉండటానికి కాదు, ఇంజిన్ పవర్, పర్ఫార్మెన్న్ పెరగడానికి మాత్రమే.
3. ఇథనాల్ కలపని పెట్రోల్
భారతదేశంలో ఇథనాల్ అసలు కలపని ఒకే ఒక ప్రీమియం పెట్రోల్ ఉంది. అదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ XP100. ఇందులో 0% ఇథనాల్ ఉంటుంది అంటే స్వచ్ఛమైన పెట్రోల్. దీని ఆక్టేన్ రేటింగ్ 100.
ఎవరికి అవసరం అంటే పాత లగ్జరీ కార్లు, సూపర్ బైక్స్ వాడేవారు ఇథనాల్ వల్ల తుప్పు పడుతుందనే భయంతో దీనిని ఇష్టపడతారు. అయితే, దీని ధర లీటరుకు రూ. 160 కంటే ఎక్కువే ఉంటుంది. పైగా అన్ని చోట్లా దొరకదు. అందుకే దీనిని అందరికీ కాకుండా కేవలం కొన్ని ప్రత్యేక వాహనాల కోసమే వాడతారు.
మీ బండిలో సాధారణ పెట్రోల్ పోసిన, ప్రీమియం పెట్రోల్ పోసిన (XP100 మినహా) అందులో 20% ఇథనాల్ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి, ఇథనాల్ తక్కువగా ఉంటుందన్న అపోహతో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రీమియం కొనే ముందు ఈ విషయం గుర్తుంచుకోవడం మంచిది.





