భారత్ ప్రతినిధి : దేశంలో డిజిటల్ చెల్లింపులతో పాటు అంతే వేగంగా UPI మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కీలక ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సమర్పించాయి. దీని ప్రకారం ప్రతి UPI లావాదేవీకి కాదు కేవలం అనుమానాస్పదంగా కనిపించే ట్రాన్సాక్షన్‌లకు మాత్రమే అదనపు నిర్ధారణ(Confirmation) తీసుకోవాలని సూచించాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కొన్ని చెల్లింపుల సమయంలో వినియోగదారులు "Yes" లేదా "No" అనే పాప్-అప్‌ను చూడొచ్చు రానున్న రోజుల్లో.
కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
మీరు చేసే UPI పేమెంట్ బ్యాంక్‌కు అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ ఖాతాకు డబ్బును వెంటనే పంపకుండా ముందుగా కస్టమర్ కు కన్ఫర్మేషన్ కోసం సందేశం కనిపిస్తుంది. "మీరు నిజంగానే ఈ చెల్లింపును చేయాలనుకుంటున్నారా?" అనే తరహాలో పాప్-అప్ వస్తుంది. వినియోగదారు "Yes" నొక్కిన తర్వాత మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఒకవేళ "No" ఎంచుకుంటే చెల్లింపు నిలిచిపోతుంది.
ప్రతి చెల్లింపునకూ కాదు....
ఈ అదనపు కన్ఫర్మేషన్ అనేది అన్ని UPI లావాదేవీలకు వర్తించదు. బ్యాంకుల ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అనుమానాస్పదంగా గుర్తించిన ట్రాన్సాక్షన్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో సాధారణ రోజువారీ చెల్లింపులు మునుపటిలాగే వేగంగా పూర్తవుతాయి.





