ఈ నెల 30న నూతన సచివాలయం ప్రారంభం
హైదరాబాద్ Hyderabad News : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 1.20 గంటలకు ఆసీనులవుతారు. అంతకుముందు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి నిర్వహించే పూజా కార్యక్రమాలను రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. సుదర్శన యాగం పూర్ణాహుతిలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం తన ఛాంబర్‌లో ప్రవేశించిన అనంతరం.. సీఎస్, మంత్రులు, కార్యదర్శులు కూడా తమ ఛాంబర్లలో ఆసీనులవుతారు. తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు సచివాలయం ప్రాంగణంలో సమావేశం ఉంటుంది. ఇందులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే సచివాలయ అధికారులు, సిబ్బంది అందరూ మధ్యాహ్నం 12 గంటల్లోపే హాజరవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. అందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులు, వాహన పాసులను తెచ్చుకోవాలని సూచించారు. వాహనాల పాసులను బీఆర్‌కే భవన్‌లోని మూడో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖలో ముందుగానే పొందాలని తెలిపారు. సచివాలయ అధికారులు, సిబ్బంది మింట్ కాంపౌండ్ వద్ద నుంచి నార్త్ ఈస్ట్ గేటు ద్వారా సచివాలయం లోనికి ప్రవేశించాలని, అక్కడే వాహనాలను నిలిపి ఉంచాలని సీఎస్ ఆదేశించారు.
తొలిరోజు ఏడు శాఖల తరలింపు
నూతన సచివాలయంలో అంతస్తుల వారీగా ఏయే శాఖలు ఎక్కడ కొలువు దీరాలనే కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. దీంతో బీఆర్‌కే భవన్ నుంచి నూతన సచివాలయంలోకి దస్త్రాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానింగ్ యంత్రాలను తరలించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సామగ్రి తరలింపునకు శాఖలవారీగా తేదీలు, సమయాలను సీఎస్ నిర్దేశించారు. ఆ మేరకు తొలిరోజు ఎస్సీ సంక్షేమం, హోం, గిరిజన సంక్షేమం, పౌర సరఫరాలు, పురపాలక, పట్టణాభివృద్ధి, యువజన, సాంస్కృతిక, రవాణా, రహదారులు, భవనాలు.. తదితర శాఖలు తమ సామగ్రిని తరలించాయి.
అంతస్తుల వారీగా శాఖలు
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ సంక్షేమం- అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక - ఉపాధి కల్పనశాఖలు
మొదటి అంతస్తు : హోం, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు
రెండో అంతస్తు: వైద్య ఆరోగ్య, విద్యుత్, పశుసంవర్ధక, ఆర్థిక శాఖలు
మూడో అంతస్తు : మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ధి- ప్లానింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు
నాలుగో అంతస్తు : పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమం, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, నీటిపారుదల, న్యాయశాఖలు.
అయిదో అంతస్తు : రవాణా, రహదారులు- భవనాలు, సాధారణ పరిపాలన శాఖలు
ఆరో అంతస్తు : ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం కార్యదర్శులు, సీఎం పేషీ ప్రత్యేకాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గదులుంటాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 30న ఘనంగా నిర్వహిస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బుధవారం రాత్రి ఆయన సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ వైభవం ఉట్టి పడేలా సచివాలయ విద్యుదీకరణ, సుందరీకరణ పనులపై దృష్టి సారించాలని అధికారులను మంత్రి అదేశించారు. ప్రధాన భవనానికి ఇరువైపులా పచ్చిక, వాటర్ ఫౌంటెన్లు, పూల మొక్కల ఏర్పాటు వంటి పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ సందర్భంగా వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ఇతరులకు కేటాయించిన సీట్లు, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.