అమరవీరులకు సీఎం కేసీఆర్ సమర్పించిన ఘన నివాళి
హైదరాబాద్ Hyderabad News : ఈ నెల 2న ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. స్వరాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు సీఎం కేసీఆర్ సమర్పించిన ఘన నివాళితో మొదలైన వేడుకలు 21 రోజులపాటు దిగ్విజయంగా కొనసాగాయి. ఒక్కోరోజు ఒక ప్రత్యేక రంగానికి కేటాయించి, ఆ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నివేదికలు విడుదల చేశారు.చివరిరోజైన గురువారం సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేతుల మీదుగా ‘తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం’ ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా,వారి ఆశయాలు ప్రజలకు సదా స్ఫురణకు వచ్చేలా ప్రభుత్వం నిర్మించిన అమర దీపం హుస్సేన్‌సాగర్ తీరాన ఇకపై అనునిత్యం దేదీప్యమానంగా వెలగనుంది. సాయంత్రం 4 గంటలకు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నుంచి 6 వేల మంది కళాకారులతో ప్రదర్శన మొదలై అమరుల స్మారక కేంద్రం వరకు కొనసాగుతుంది. పదేళ్ల తెలంగాణ ప్రగతిని చాటిచెప్పేలా సచివాలయం స్మృతివనం ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా లేజర్‌షో నిర్వహిస్తారు.అమరుల స్మారకం ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ముగింపు వేడుకల సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అమరుల కుటుంబాలకు ఆహ్వానాలు వెళ్లాయి.గురువారం ఉదయం 10.30 గంటలకు పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రెండు పడకల ఇళ్ల సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు. 11.30 గంటలకు కొండకల్‌లో మేథా రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించి ప్రసంగిస్తారు. 12.30 గంటలకు పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమిపూజ చేసి, బహిరంగ సభలో మాట్లాడుతారు.
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఆహ్వానం
హైదరాబాద్‌లో అమరుల స్మారక కేంద్రం ఆవిష్కరణకు రావాలని తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి, భారాస నేత శంకరమ్మను సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిసింది. ఈమేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి రెండు రోజుల కిందట ఆమెను ఆహ్వానించినట్లు సమాచారం. సీఎం కార్యాలయం నుంచీ ఆహ్వానం అందినట్లు శంకరమ్మ తెలిపారు. శ్రీకాంతాచారితోపాటు వెయ్యి మంది అమరుల త్యాగాలతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. మరోవైపు గవర్నర్ కోటాలో ఆమెను ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారనే ప్రచారమూ సాగుతోంది. 2014 ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నుంచి అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శంకరమ్మ పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి ఇక్కడి నుంచే టికెట్ ఆశించగా నిరాశే ఎదురైంది.నాటి నుంచి ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని చాలాకాలంగా అధిష్ఠానాన్ని కోరుతున్నారు. తాజాగా కేసీఆర్ నుంచే పిలుపు రావడంతో తనకు కచ్చితంగా పదవి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.





