ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల మోసాలు
* అత్యాశకు పోయి బాధితులు లబోదిబో
* రోజూ 3 కోట్లకు టోకరా
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : వాట్సాప్, టెలిగ్రామ్‌లను అడ్డాగా చేసుకొని ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రోజూ సరాసరిన హైదరాబాద్‌లో రూ.3 కోట్లదాకా కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ క్రైమ్ ఠాణాలకు వస్తున్న ఫిర్యాదుల్లో గతకొంత కాలంగా ఈ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ట్రేడింగ్‌లో లాభాలొస్తాయని, ఆ కిటుకులు మేం నేర్పుతామంటూ సోషల్ మీడియాలో కొందరు ఊదరగొడుతున్నారు. వాట్సాప్ సందేశాలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఇదీ సంగతి ఈ ట్రేడింగ్ మోసాలలో ముందుగా వాట్సాప్ టెక్స్ మేసేజ్‌లు వస్తున్నాయి. ఆ తరువాత టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం ఇస్తున్నారు. అయితే ఈ గ్రూప్‌లో ఉండేవారిలో 90 శాతం మోసగాళ్లకు సంబంధించినవారే. తాము ట్రేడింగ్ చేస్తే ఇంత లాభం.. అంత లాభం వచ్చిందంటూ గ్రూప్‌లో ఉన్నవారిని ఉత్సాహపరుస్తూ మరింత ఆశ పెంచేలా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముందుగా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి లాభాలు చూపిస్తున్నారు. దీంతో నమ్మకం కుదిరి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్వెస్టర్లు నిండా మునుగుతున్నారు. కాగా, తమ యాప్‌లు, వెబ్‌సైట్‌ల లింక్‌ల ద్వారానే ట్రేడింగ్ చేయాలని మోసగాళ్లు సూచిస్తున్నట్టు బాధితులు చెప్తున్నారు. తక్కువ పెట్టుబడులకు నగదు విత్‌డ్రా ఆప్షన్ ఇస్తున్న నేరగాళ్లు.. ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు దాన్ని బ్లాక్ చేస్తున్నారు.
ఆపై పన్నులు చెల్లించాలని, ఇంకో వారం రోజులు ఉంచితే మరిన్ని లాభాలొస్తాయని మభ్యపెడుతున్నారు. చివరకు ఆ మొత్తాలను కాజేస్తున్నారు. బాధితుల వివరాల్లోకెళ్తే షేక్‌పేట్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి.. తన వాట్సాప్ నంబర్‌కు వచ్చిన మేసేజ్‌కి స్పందించాడు. వెంటనే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ పేరు చెప్పుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి సదరు ఉద్యోగి చేత మోసగాళ్లు ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. మొదట కొన్నాళ్లు లాభాలు చూపించడంతో పెట్టుబడులు పెడుతూపోయానని, చివరకు మోసపోయానని బాధితుడు వాపోయాడు. 2022 ఏప్రిల్ నుంచి ఈ నెల 4 వరకు రూ.90.70 లక్షలు పెట్టుబడిగా పెట్టినట్టు చెప్పాడు. అయితే మోసం తెలిసి బాధితుడు సీసీఎస్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్‌లో గత నెల 4న మేసేజ్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయగానే 140 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోకి వెళ్లింది. ఇక అక్కడి నుంచి సాగిన చాటింగ్‌లు బాధితుడిని రూ.35 లక్షల మేర ముంచాయి. మరో ఘటనలోనూ సైదాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.11 లక్షలు కాజేశారు. కాగా, ఈజీ మనీకి ఆశపడేవారే సైబర్ నేరగాళ్ల టార్గెట్ అవుతున్నారు. ఇకనైనా అనామక కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందించవద్దని, అనవసరపు లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు తమను సంప్రదించాలని కోరుతున్నారు.