ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకిచ్చారు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వెబ్‌నోట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు.
వారంలో మెయిన్స్ జరుగుతాయనగా కొత్త నంబర్లతో హాల్‌టికెట్లు జారీ అయ్యాయన్నారు. వరుసగా నంబర్లు కేటాయించడానికి సులభంగా ఉంటుందని టీజీపీఎస్సీ చెబుతున్న కారణం సహేతుకంగా లేదన్నారు. కేవలం కొంత మందికి లబ్ధి చేకూర్చడానికే మెయిన్స్‌కు హాల్‌టికెట్లు వేరుగా ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీపీఎస్సీ పరీక్షలకు లక్షల మంది హాజరైనా ఒకే హాల్ టికెట్ జారీ చేస్తున్నదన్నారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలకు రెండు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు.