మహిళలకు శుభవార్త గ్యారెంటీ లేకుండా SBI అశ్మిత స్కీమ్ లోన్స్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : దేశంలో చాలా మంది ప్రస్తుతం ఉన్నత విద్య తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఒకరి కింద ఎంత జీతం వచ్చినా దానికంటే సొంతంగా వ్యాపారాన్ని చేసుకోవటం ఉత్తమంగా వారు భావిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడి గుర్తింపు తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ఆలోచనలు కలిగిన మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకంతో ముందుకొచ్చింది.
వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన అశ్మిత లోన్ స్కీమ్ గురించే. దీనికింద మహిళా వ్యాపారవేత్తలు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణాలను పొందవచ్చని బ్యాంక్ వెల్లడించింది. మహిళా దినోత్సవతం సందర్భంగా దీనిని ప్రవేశపెట్టిన బ్యాంక్ డిజిటల్ రూపంలోనే లోన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపింది. తద్వారా వేగంగా, సులువగా అర్హులైన మహిళా వ్యాపారవేత్తలు రుణాలను పొందవచ్చని పేర్కొంది.
ఎస్ఎంఈ కింద పనిచేస్తున్న వ్యాపార సంస్థలను నడుపుతున్న మహిళలు స్కీమ్ కింద రుణాలను పొందవచ్చని బ్యాంక్ వెల్లడించింది. జీఎస్టీ రికార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్, క్రెడిట్ బ్యూరో నుంచి సమాచారం ఆధారంగా రుణం ప్రాసెస్ చేయబడుతుందని బ్యాంక్ పేర్కొంది. మంచి పనితీరు కలిగిన వ్యాపార సంస్థలు సులువగా తమ బిజినెస్ అవసరాల కోసం రుణాన్ని పొందవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. రుణానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. లేదా మీకు సమీపంలోని బ్యాంక్ శాఖను సంప్రదించటం ఉత్తమం.
ఇదే క్రమంలో బ్యాంక్ మహిళల కోసం నారీ శక్తి డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. మహిళల ప్రత్యేక అవసరాలను తీర్చటానికి ఇది దోహదపడుతుందని బ్యాంక్ పేర్కొంది. షాపింగ్, ట్రావెల్, లైఫ్ స్టైల్, ఇన్సూరెన్స్ వంటి వాటిపై ప్రత్యేక ఆఫర్లను ఈ కార్డు ద్వారా పొందవచ్చని బ్యాంక్ వెల్లడించింది.