లైసెన్స్ రెన్యూవల్ పై కొత్త రూల్ 55 ఏండ్లు దాటినవారికి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఐదు పదుల వయస్సు దాటిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ రాబోయే రోజుల్లో మరింత కఠినతరం కానుంది. 55 ఏండ్లు నిండిన, ఆపై వయస్సు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ను ఇకపై రెన్యూవల్ చేయాలంటే వారికి మళ్లీ డ్రైవింగ్ టెస్టు నిర్వహించాలనే కొత్త ప్రతిపాదనను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతో పాటు వారి ఆరోగ్య స్థితిగతులను తెలియజేసే మెడికల్ రిపోర్టు తప్పనిసరిగా దరఖాస్తు వెంట జత చేయాల్సి ఉంటుందని దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టాలని కోరింది.
ప్రస్తుత విధానంలో ఇదే వయస్సు వారికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కావాలంటే కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. మరో ఐదేండ్ల పాటు వారి లైసెన్స్ ను పునరుద్ధరిస్తారు. అయితే, రానున్న రోజుల్లో కేంద్రం తీసుకువచ్చే ఈ కొత్త నిబంధన రాష్ట్రంలో అమలు చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. దీని అమలు సాధ్యాసాధ్యాలపై ట్రాన్స్‌పోర్టు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడం, జాతీయ, రాష్ట్ర రహదారులు నిత్యం రక్తమోడుతుండడంతో వీటి నియంత్రణ కోసం కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ అధికారులను కూడా ఈ విషయంలో అప్రమత్తం చేసింది.