భారత్ ప్రతినిధి : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ను నిలిపివేయాలని ఇవాళ గురువారం (2025 అక్టోబర్ 16న) కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ షోపై, గజ్వేల్కు చెందినకమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ రియాలిటీ షో అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో తెలిపారు.
‘‘బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదు. ఇలా కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకుని, సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలి. లేకపోతే బిగ్ బాస్ హౌస్ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని’’ హెచ్చరించారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని సూచించారు.
ఇప్పటికే, చాలా చోట్ల బిగ్ బాస్ సోపై విమర్శలు, కంప్లైంట్స్ వస్తున్నాయి. గత సీజన్లపై కూడా చాలామంది తమ అభిప్రాయాలూ పంచుకుంటూ, షోని నిలిపేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. అయినప్పటికీ 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుని 9 వ సీజన్లో అడుగుపెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇపుడు ఈ లేటెస్ట్ కంప్లైంట్తో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బిగ్ బాస్ 9 తెలుగులో ఆరో వారం కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. వైల్డ్ కార్డ్స్ వర్సెస్ పాత హౌస్ మేట్స్లో హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఆరో వారం ఓటింగ్లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ డేంజర్ జోన్లో కొనసాగుతున్నాడు. భరణి, పవన్, రాముకు మధ్య కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే, ప్రస్తుత ఓటింగ్ ట్రెండింగ్ ప్రకారం రాము ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఇటీవలే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిత్యం ఎవరో ఒకరితో వాదనలకు దిగుతూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. మాధురి వర్సెస్ హౌస్‌మేట్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎవరిపై పడితే వాళ్లపై అరిచేస్తుంది. ఈ క్రమంలోనే కంప్లైంట్ రావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.






 
 
 
 
