తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పోలీసులమని, మఫ్టీలో ఉన్నామని చెప్తున్నా పట్టించుకోకుండా రోహిత్‌రెడ్డి ఫైరింగ్‌కు ఆదేశించినట్టు తెలిసింది. ‘‘కాల్చిపారేయండి.. ఏం జరిగినా నేను చూసుకుంటా’’ అని ఆయన రెచ్చగొట్టడం వల్లే ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించారు.
ఈ మేరకు నమిత్‌శర్మ , రోహిత్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి సోదరుడు రితేశ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోహిత్‌రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ సహా మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. పోలీసులపై కాల్పులకు యత్నించారని ఢిల్లీ రియల్టర్ నమిత్‌శర్మ, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డిని ఆర్మ్స్ యాక్ట్ కింద రిమాండ్ చేశారు. నమిత్ శర్మపై దాడికి వచ్చారని ఫైరింగ్ ఆర్డర్ మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా సెర్చ్ వారెంట్‌తీసుకున్నారు.
ఈగల్ ఫోర్స్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్, మొయినాబాద్ పోలీసులు సహా సుమారు 40 మందికి పైగా పోలీసులు మఫ్టీలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఫామ్‌హౌస్ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో గోడలు దూకి లోపలికి వెళ్లారు. కాగా, అప్పటికే లిక్కర్, డ్రగ్స్ మత్తులో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్‌శర్మ ఢిల్లీలోని తన ప్రత్యర్థులే దాడికి యత్నిస్తున్నారని అనుమానించినట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే రోహిత్‌రెడ్డి తమ్ముడు రితేశ్‌రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్‌ను నమిత్‌శర్మ తీసుకున్నట్టు సమాచారం. పారిపోయేందుకే తమపై కాల్పులకు యత్నించారని, రోహిత్‌రెడ్డి ఇందుకు పురమాయించారని పోలీసులు చెప్తున్నారు. తాము పోలీసులమని పలుమార్లు అనౌన్స్ చేయడంతో ఫైరింగ్ ఆగిపోయిందని పేర్కొంటున్నారు.
రోహిత్‌రెడ్డి పిలుపు మేరకే నమిత్‌శర్మ, ఏపీ ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్, ఢిల్లీ రియల్టర్ సహా 11 మంది పార్టీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి డ్రగ్ పార్టీ కోసమే సిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఒక్కో గ్రాము రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చినట్టు వివరించారు.
లిక్కర్‌లో కొకైన్ మిక్స్‌చేసి తాగినట్టు నిర్ధారణ అయిందని కోర్టుకు వెల్లడించారు. కాల్పులు జరిపిన నమిత్‌శర్మ మూడు రకాల డ్రగ్స్‌తో పాటు లిక్కర్‌కూడా తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్‌రిపోర్టులో నిర్ధారణ అయిందని తెలిపారు. రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆర్మ్స్ యాక్ట్ కింద రోహిత్ రెడ్డి, నమిత్‌శర్మ, రితేశ్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి.





