క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ అందులో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఆ క్రేజే వేరు. వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన పోరు మాత్రం ముంబై అభిమానులకు ఒక పీడకలగా మిగిలిపోయింది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబైని వారి సొంత గడ్డపైనే చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి పలు రికార్డులు బద్దలు కొట్టింది.
చెన్నై విజయంలో సంజు సామ్సన్ మెరుపులు, అకీల్ హోసేన్ అద్భుతమైన బౌలింగ్ కీలక పాత్ర పోషించాయి. ఈ విజయంతో సీఎస్కే 2026 సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేయడమే కాదు 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తమ అతిపెద్ద విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2015లో పంజాబ్‌పై సాధించిన 97 పరుగుల రికార్డును చెరిపేస్తూ 103 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది.
మరోవైపు ముంబై ఇండియన్స్‌కు ఇది అత్యంత దారుణ ఓటమి. 2013లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 87 పరుగుల తేడాతో ఓడిన రికార్డును ఇప్పుడు చెన్నై అధిగమించింది. అలాగే ముంబైపై అత్యధిక విజయాలు (19 విజయాలు) సాధించిన జట్టుగా కూడా సీఎస్కే అగ్రస్థానానికి చేరుకుంది. వాంఖడేలో ముంబైపై అత్యధికంగా 6 విజయాలు సాధించిన జట్ల జాబితాలో పంజాబ్‌తో కలిసి చెన్నై ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచింది.
ఈ సీజన్ ముంబైకి ఏమాత్రం కలిసిరావడం లేదు. సొంత మైదానంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి చేదు రికార్డును మూటగట్టుకుంది. కోల్‌కతాపై గెలిచి ఘనంగా ప్రారంభించినా ఆ తర్వాత బెంగళూరు, పంజాబ్, ఇప్పుడు చెన్నై చేతిలో ఓడిపోయి డీలా పడింది. మరి హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై టీమ్ హైదరాబాద్, లక్నో, రాజస్థాన్‌లతో జరగనున్న మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.





