కుటుంబాలను ఒకటి చేస్తున్నా సినిమా "బలగం"
నిర్మల్ Nirmal News : సమాజంలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలకు, అనుబంధాలకు పెద్దపీట వేసి ఎంతో మంది విడిపోయిన కుటుంబాలను కలుపుతున్న సినిమా బలగం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రదర్శింపబడుతున్న సినిమా బలగం ప్రతి ఒక్కరిలోనూ అనుబంధాలను తట్టి లేపుతుంది.మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే బలగం వంటి సినిమాల అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న గొడవలతో విడిపోయిన నిర్మల్ జిల్లాలోని లక్షణ చాందకు చెందిన అన్నాతమ్ముళ్లను కలిపిన బలగం సినిమా ఇక తాజాగా ఎంతోకాలంగా మాటల్లేకుండా ఉంటున్న అక్కా తమ్ముళ్లను ఒక్కటి చేసింది. వనపర్తి జిల్లాలోని వనపర్తి మండల పరిధిలో ఇటీవల బలగం చిత్రం ప్రదర్శన ఎంతోకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న అక్కా తమ్ముళ్లను కలిపింది. ఒకే ఊరిలో ఉంటున్నా సరే మాట్లాడుకోకుండా ఉంటున్న అక్కా తమ్ముళ్ళను బలగం ఒక్కటి చేసింది.ఇంతకు ఏం జరిగిందంటే అనుముల లింగారెడ్డి, లక్ష్మీ అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ రెండు కుటుంబాలు కూడా వనపర్తిలోనే నివాసం ఉంటున్నాయి. అయితే 15 సంవత్సరాల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మీ ఫోటో తీయకపోవడంతో వారి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. చిన్న సంఘటన అయినప్పటికీ ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
ఇక సంవత్సరంన్నర క్రితం లక్ష్మీ భర్త వీరారెడ్డి మృతిచెందగా అప్పుడు కూడా లింగారెడ్డి, అక్క దగ్గరకు వెళ్లలేకపోయాడు. ఆ సమయంలో లింగారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో లింగారెడ్డి భార్య వసంత, లింగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇరు కుటుంబాల మధ్య సఖ్యత కుదరలేదు. ఇక ఇటీవల వనపర్తి పంచాయతీ కార్యాలయంలో బలగం సినిమాను ప్రదర్శించారు.
ఆ సినిమా చూసిన లింగారెడ్డి, లక్ష్మిలు కంటతడి పెట్టుకున్నారు. అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధం గుర్తొచ్చి ఆవేదన చెందారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచి శ్రీధర్, కొందరు గ్రామస్తులతో కలిసి ఇద్దరి కుటుంబాలను కలిపే ప్రయత్నం చేశారు. దీంతో అక్క లక్ష్మీ, తమ్ముడు లింగారెడ్డి ఒకరినొకరు చూసుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఆ తర్వాత ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఎంతో కాలంగా విడిపోయిన వీరి కుటుంబాలు కలవడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.