తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీలపై మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ మాట్లాడుతూ రాయదుర్గం పోలీసులు బైక్ చోరీ దొంగను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి కటాయి రాములు(23) అని, ఇతని సొంతూరు వికారాబాద్ జిల్లా అని తెలిపారు. శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు సహా పలు చోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. మొత్తం 14 కేసుల్లో ఇతనికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో 8 కేసులు రాయదుర్గం పరిధిలో, చందానగర్ పరిధిలో 5, ఫిల్మ్ నగర్లో 1 కేసు నమోదైంది.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీలో బైక్లు, స్కూటీల దొంగతనాలపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు మాదాపూర్ ఏసీపీ తెలిపారు. రాయదుర్గం మెహ్ఫిల్ హోటల్ దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా చేసిన ఈ ఆపరేషన్లో రాయదుర్గం పోలీసులు సుమారు 6 లక్షల విలువైన 14 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
సెప్టెంబర్ 12న కూడా బైక్ చోరీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన నిందితులు సాయికుమార్ (21), సాయికిరణ్ (19) జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు పాల్పడ్డారు. చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, కేపీహెచ్బీ కాలనీ, గచ్చిబౌలి, సంగారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 14 బైకులను రికవరీ చేశారు.