తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : జూన్ నెల వచ్చేసింది.. ఎండలతో పాటు సెలవుల మూడ్ కూడా తెచ్చేసింది. మీ అకౌంట్‌లో డబ్బులున్నా, అర్జెంట్‌గా బ్యాంకుకెళ్లి ఏదైనా పని చక్కబెట్టుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ జూన్ 2026 లో బ్యాంకులు ఏకంగా 11 రోజులు సెలవుల్లోకి వెళ్లిపోతున్నాయి. నేరుగా బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లాలనుకుంటే ముందుగా హాలీడేస్ లిస్టును చూసి ప్లాన్ చేసుకోవటం బెటర్.
RBI రూల్స్ ప్రకారం ఎలాగూ ప్రతి ఆదివారం, అలాగే 2వ, 4వ శనివారాల్లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. ఈ లెక్కన జూన్ 7, 14, 21, 28 ఆదివారం సందర్భంగా బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయి. దీనికి తోడు జూన్ 13న రెండో శనివారం, జూన్ 27న నాల్గవ శనివారం కావటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవని ఖాతాదారులు గుర్తించాలి. అంటే ఈ ఆరు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు అస్సలు ఓపెన్ అవ్వవు.
రీజినల్ పండగలు.. ఎక్కడెక్కడ సెలవంటే?
దేశవ్యాప్తంగా కాకపోయినా.. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండగలు, ప్రత్యేక రోజులను బట్టి బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ లిస్ట్ ఇదే:
* జూన్ 15 : ఐజ్వాల్ (మిజోరాం) లో 'యంగ్ మిజో అసోసియేషన్' డే సందర్భంగా, అలాగే భువనేశ్వర్ (ఒడిశా) లో 'రాజా సంక్రాంతి' పండగ కారణంగా బ్యాంకులు పని చేయవు.
* జూన్ 25 : మన ఆంధ్రప్రదేశ్ లో మొహర్రం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
* జూన్ 26 : తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి దాదాపు దేశంలోని మెజారిటీ ప్రధాన నగరాల్లో మొహర్రం సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి.
* జూన్ 29 : శిమ్లా (హిమాచల్ ప్రదేశ్) లో 'సంత్ గురు కబీర్ జయంతి' సందర్భంగా బ్యాంకులు క్లోజ్.
* జూన్ 30 : ఐజ్వాల్ (మిజోరాం) లో ప్రాంతీయ పబ్లిక్ హాలిడే 'రెమ్నా ని' కారణంగా సెలవు.
ఇక్కడ ఖాతాదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే జూన్ 26 శుక్రవారం మొహర్రం సెలవు, జూన్ 27 నాల్గవ శనివారం, జూన్ 28 ఆదివారం అంటే చాలా చోట్ల లాంగ్ వీకెండ్ కారణంగా వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. సో అర్జెంట్ వర్క్స్ ఉన్నవాళ్లు ముందుగానే వాటిని పూర్తి చేసుకోవటం మంచిది.
బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నంత మాత్రాన ఆర్థిక కార్యకలాపాలు ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు 24/7 అందుబాటులోనే ఉంటాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లేదా మీ బ్యాంక్ అఫీషియల్ యాప్స్ ద్వారా ఎప్పుడైనా, ఎవరికైనా పైసలు పంపించుకోవచ్చు. అలాగే NEFT, RTGS, IMPS వంటి నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా పెద్ద మొత్తంలో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఏటీఎంలు ఎప్పుడూ రన్నింగ్‌లోనే ఉంటాయి. అలాగే యాప్స్ ద్వారా కొత్త డెబిట్/క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేయడం, లాకర్ల కోసం రిక్వెస్ట్ పెట్టడం వంటివి హ్యాపీగా ఇంటి దగ్గర నుంచే సెలవు రోజుల్లో కూడా పూర్తి చేసేయొచ్చు. కాబట్టిఈ సెలవుల క్యాలెండర్‌ని మైండ్‌లో ఉంచుకుని మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ సెట్ చేసుకోండి.





