పీజీటీ ఉద్యోగాల్లో 76% మహిళలకే
* మొత్తం 1276 పోస్టుల్లో 966 వారికి రిజర్వు
* ఆర్ట్‌టీచర్ ఉద్యోగాల్లోనూ అత్యధికం అతివలకే
హైదరాబాద్ Hyderabad News : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయనున్న 1276 పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల్లో 76 శాతం మహిళలకు రిజర్వు అయ్యాయి. పీజీటీ ఉద్యోగాల భర్తీకి వెల్లడైన సమగ్ర ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న వివరాల మేరకు.. మహిళలకు 966 పోస్టులు, జనరల్ కింద 310 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో అత్యధికంగా బీసీ గురుకులాల్లో 786 పోస్టులు, ఆ తరువాత ఎస్సీ గురుకులాల్లో 343, ఎస్టీ గురుకులాల్లో 147 పోస్టులు ఉన్నాయి. పీజీటీ పేపర్-1 పరీక్ష అన్ని సబ్జెక్టుల పోస్టులకు ఉమ్మడిగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుందని, పేపర్-2, 3, పరీక్షలు (భాషలు మినహా) ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని, పరీక్షల నిర్వహణలో బోర్డుదే తుది నిర్ణయమని వెల్లడించింది.
అర్హతలు ఇలా...
పీజీటీ పోస్టులకు పీజీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు 45 శాతం మార్కులు చాలు. అభ్యర్థులు పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులు కావాలి. భాషల పోస్టులకు ఎన్‌సీటీఈ గుర్తింపుపొందిన విద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో మెథడాలజీ లేదా భాషా పండిత శిక్షణ పొందాలి.
132 ఆర్ట్ టీచర్ల పోస్టులకు సమగ్ర ప్రకటన
సంక్షేమ గురుకులాల్లో 132 ఆర్ట్ టీచర్ల పోస్టులకు సమగ్ర ప్రకటన వెలువడింది. ఈ పోస్టుల్లో 85 శాతం మహిళలకు, 15 శాతం జనరల్ అభ్యర్థులకు రిజర్వు అయ్యాయి. ఈ పోస్టుల భర్తీకి 100 మార్కులకు పరీక్ష, మరో 25 మార్కులకు డెమో ఉంటుంది. పీజీటీ, ఆర్ట్ టీచర్ పోస్టులకు ఈ నెల 24 నుంచి మే 25 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల నియామకబోర్డు వెల్లడించింది. పరీక్షల షెడ్యూలు వెబ్‌సైట్లో పొందుపరుస్తామని తెలిపింది.
ఆర్ట్ టీచర్ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఆర్ట్స్‌లో డిప్లొమా లేదా డ్రాయింగ్‌లో టీసీసీ కోర్సుతో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి లోయర్ లేదా హయ్యర్‌గ్రేడు డ్రాయింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ పోస్టులకు హోంసైన్స్‌లో డిప్లొమా కోర్సు లేదా క్రాఫ్ట్‌టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సు లేదా ఆర్ట్, పెయింటింగ్, స్కల్పచర్‌లో ఫైన్‌ఆర్ట్స్ డిగ్రీ లేదా పెయింటింగ్, స్కల్పచర్, ప్రింట్ మేకింగ్‌లో బీఎఫ్‌ఏ డిగ్రీ లేదా యానిమేషన్‌లో బీఎఫ్‌ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులని బోర్డు తెలిపింది.సాధారణ అభ్యర్థులు దరఖాస్తు, పరీక్ష ఫీజు కింద రూ.1200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి.