ఫోన్ పోయిందా..ఇది తప్పక చదవాల్సిందే మరి
* ‘సీఈఐఆర్’తో ఈజీగా కనిపెట్ట వచ్చు
* మొబైల్‌ను బ్లాక్ చేసుకోవచ్చు.. దొరికాక అన్‌బ్లాక్ చేయవచ్చు
* మార్గం సుగమం చేసిన కేంద్ర టెలికం సంస్థ
* సాంకేతికతపై అవగాహన తప్పనిసరి
సాంకేతికం Technology News : సాంకేతికత అభివృద్ధి చెందడంతో ప్రపంచమే కుగ్రామంగా మారింది. సమాజం స్మార్ట్ యుగం వైపు అడుగులు వేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలోనే కాదు శరీరంలోనూ ఒక భాగంగా మారింది. 99.90శాతం మంది సెల్‌ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఫోన్ ఒక్కసారిగా మిస్ అయితే.. ఆ పరిస్థితి మాటల్లో చెప్పలేం.. ప్రయాణం చేస్తున్నప్పుడు.. లేదంటే ఎవరైనా దొంగిలించినప్పుడు ఇబ్బంది పడుతుంటాం కానీ, ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. పోయిన ఫోన్‌ను తిరిగి పొందేందుకు కేంద్ర టెలికం సంస్థ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) అనే వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఈసైట్‌పై పోలీసుశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది.
‘సీఈఐఆర్’ని సద్వినియోగించుకునేదిలా..!
వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నైట్లెతే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ కోసం అందుబాటులో ఉన్న www.ceir.gov.in వెబ్‌సైట్‌ను తెరవాలి. అనంతరం అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్/స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి పోగొట్టుకున్న డివైస్ ఇన్ఫర్మెన్ అనగా మొబైల్ నెంబర్-1 లేదా మొబైల్ నెంబర్-2, ఐఎంఈఐ-1, ఐఎంఈఐ-2 అంకెలు, అక్షరాలను ఖాళీ బాక్సుల్లో పేర్కొనాలి. అదేవిధంగా డివైస్ బ్రాండ్(మొబైల్) ఎంపిక చేసుకుని డివైస్ మోడల్ టైప్ చేసి వినియోగదారుడు ఆ ఫోన్ కొన్నప్పటి పర్చేస్ ఇన్వాయిస్ రశీదుని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనగా వినియోగదారుడు ఫోన్ పోగొట్టుకున్న ప్రదేశం, ఆ తేదీ, రాష్ట్రం లేదా యునైటెడ్ టెరీటోరీ, జిల్లా, ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ పేరు, పోలీస్ కైంప్లెంట్ నెంబర్ పేర్కొని, బాధితుడు పోలీస్ ఫిర్యాదు చేసి దరఖాస్తుని అప్లోడ్ చేయాలి. తరువాత ఫోను కొన్న అసలు వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని సైతం అందులో పొందుపరచాలి.
ఫోన్ యజమాని పేరు, అడ్రెస్ పేర్కొని ఐడెంటిటీ కార్డుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కింద ఉన్న బాక్సులో ఐడెంటిటీ నంబరుతోపాటు ఈ మెయిల్ ఐడీని పేర్కొని, కింది క్యాప్చా బాక్సులో వచ్చిన ఆంగ్ల అక్షరాలను పక్కన బాక్సులో యథావిధిగా ఎంటర్ చేయాలి. ఆ తరువాత వినియోగదారుడి వద్ద ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పొందాలి. తరువాత డిక్లెరేషన్ వద్ద టిక్ చేసి సబ్మిట్ నొక్కిన అనంతరం వినియోగదారుడు ప్రస్తుత మొబైల్ నంబరుకి వచ్చిన ఓటీపీని బాక్సులో పొందుపరిస్తే సీఈఐఆర్ దరఖాస్తు ప్రక్రియ పూర్తైనట్లే.
ఈ విధానం పని చేస్తుందిలా..!
సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధిత వినియోగదారులు వివరాలను పొందుపరిచి దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆ సంస్థకు సమాచారం వెళ్తుంది. అనంతరం సీఈఐఆర్ ప్రధాన కార్యాలయం నుంచి వినియోగదారుడికి దరఖాస్తు నిర్ధారణ సందేశం వెళ్తుంది. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వినియోగదారుడు పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ ఐఎంఈఐ నంబరు గల ఫోనులో మరో నంబరు వేసినా, లేదా దాన్ని వేరేవిధంగా వినియోగించినా వెంటనే సమాచారం వెళ్తుంది. తద్వారా పోలీసులు బాధితుల ఫోనుని చేధించడం సులభతరమవుతుంది. సీఈఐఆర్ విధానంతో వినియోగదారులు పొగొట్టకున్న మొబైల్ ఫోను పని చేయకుండా నిలిపివేస్తుంది. ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్ దొరిగిన అనంతరం వినియోగదారుడు రిక్వెస్ట్ ఫర్ అన్-బ్లాకింగ్/ఫౌండ్ మొబైల్ ఆప్షన్‌లోకి వెళ్లి తమకు సందేశం ద్వారా వచ్చిన రిక్వెస్ట్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన అనంతరం దేనివల్ల అన్-బ్లాక్ చేస్తున్నారనే అంశాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. తరువాత కింద బాక్సులో పొందుపరిచిన అంకెలు/అక్షరాలను యథావిధిగా ఎంటర్ చేసి ఓటీపీ పొందాల్సిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. తరువాత ఓటీపీని సదరు వినియోగదారుడు నిర్ధారించుకుంటే ఫోన్ తిరిగి అన్-బ్లాక్ అవుతుంది.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి...
మొబైల్ వినియోగదారులు అప్రమత్తతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని సులభంగా తిరిగిపొందవచ్చు. ఆన్‌లైన్‌లో అడిగిన వివరాలను క్రమంగా పొందుపరిచే విధంగా సీఈఐఆర్ వెబ్‌సైట్‌పై అవగాహన పెంచుకోవాలి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో సైబర్ నేరాలు సైతం కొత్త కోణాల్లో ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అదుపు చేయాలంటే ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతోపాటు తోటివారిని అప్రమత్తం చేయాలి.