ఎక్మాయి గ్రామంలో రెండెకరాలు అసైన్డ్ భూమి కబ్జా చేసిన వీఆర్ఎ
* గ్రామ శివారులోని సర్వే నంబరు 111లో
* సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత
* రైతులకు దారివ్వకుండా దౌర్జన్యం
* సర్వేలో నిర్ధారించిన రెవెన్యూ అధికారులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో శనివారం రోజున ప్రభుత్వ భూమిని ఓ వీఆర్ఎ కబ్జా చేసిన సంఘటన రెవెన్యూ అధికారుల సర్వేలో వెలుగు వచ్చింది.వివరాల ప్రకారం గ్రామ శివారులోని సర్వే నంబరు 111లో 133ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది.సులేగాం హన్మంతు తల్లి పేరున ప్రభుత్వం రెండు ఎకరాలు ఇచ్చింది. వారి దాయాది సులేగాం అంతప్పకు 4 ఎకారాలిచ్చింది. అంతప్ప చనిపోవడంతో కొంత కాలంగా కుమారులు సాగుచేశారు.వీరు కూడా మరణించడంతో వారి భూమి బీడుగా మారింది.ఈ భూమిపై వీఆర్ఎ హన్మంతు కుటుంబం కన్నుపడింది. వారు అంతప్ప భూమిని సైతం సాగుచేస్తు న్నారు. హన్మంతు తల్లి పేరున ఉన్న రెండెకరాలు పోను మరో రెండెకరాలూ సాగుచేసుకుంటున్నారు.
అక్కడితో ఆగకుండా పక్క ఉన్న చిన్నపాటి కాలువను,చెట్లను నరికేసి పక్క పొలాల రైతులకు దారిలేకుండా కాలువను దున్నేశాడు. దీంతో తోటి రైతులు కిష్టయ్య, గోపాల్, బసప్పు,నర్సమ్మ, భీమమ్మ, హబీట్ రహీం, దస్తయ్య తదితరులు హన్మంతుపై తహసీల్దారు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశానుసారంగా ఆర్ఐ రాకేశ్,సర్వేయర్ ప్రభుకుమార్ 111 సర్వే నంబర్లో అసైన్డ్ భూములను సర్వే చేశారు. హన్మంతు కుటుంబానికిచ్చిన రెండెకరాలతో పాటు అదనంగా రెండెకరాలు సాగు చేసుకుంటున్నట్లు అధికారులు నిర్ధారించారు.వీఆర్ఎ కుటుంబీకులు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేయగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓ బాధిత మహిళ తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి సులేగాం అంతప్ప పేరున ఉన్న 4ఎకరాల భూమిని సులేగాం బసమ్మ కుటుంబం కబ్జా చేసిందని తహసీల్దార్ ఎన్.వెంకటస్వామికి ఫిర్యాదు చేసింది. అధికారులు కూడా భూకబ్జాపై తహసీల్దార్కు నివేదించడంతో ఆయన విచారణకు ఆదేశించారు.