భారత్ ప్రతినిధి : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఈ సమయంలో చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధాప్యంలో రిస్క్ తీసుకోకుండా, పెట్టిన డబ్బుకు భద్రతతో పాటు తప్పకుండా ఆదాయం రావాలని చాలామంది సీనియర్ సిటిజన్లు కోరుకుంటారు. అలాంటి వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) మంచి పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు. సాధారణంగా బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తే కొంత కాలానికి స్థిరమైన వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా, సాధారణ కస్టమర్లతో పోలిస్తే చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని కూడా ఇస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై గరిష్టంగా 8.60 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ విషయంలో ముందున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?
చాలామంది సీనియర్ సిటిజన్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నమ్మకం, సుదీర్ఘకాలంగా ఉన్న సేవలు దీనికి ప్రధాన కారణాలు. అయితే, అధిక వడ్డీ రేట్ల విషయంలో కొన్ని స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకుల్లో రేట్లు కొంత తక్కువగా ఉండవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 7.45 శాతం వరకు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 7.35 శాతం వరకు.
ఇండియన్ బ్యాంక్ – 7.30 శాతం వరకు.
బ్యాంక్ ఆఫ్ బరోడా – 7.25 శాతం వరకు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 7.10 శాతం వరకు.
కెనరా బ్యాంక్ – 7.10 శాతం వరకు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – 7.05 శాతం వరకు.
ఈ లిస్టులో బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.45 శాతం వరకు వడ్డీని అందిస్తూ ముందుంది. ఎస్‌బీఐలో మాత్రం గరిష్ట వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంది.





