కిడ్నీలోంచి మొత్తం 300 రాళ్లను వెలికి తీశారు
* ఏం తాత కిడ్నీలో ఇన్ని రాళ్లు పోగేశావా..?
కరీంనగర్ Karimnagar : జీవితంలో నాలుగు రాళ్లు పోగేసుకోవాలని పెద్దలు అంటుంటారు. ఈ తాతకు వాళ్ల తాత చెప్పిన మాటలు బాగా వంటబట్టినట్లున్నాయి.ఏకంగా జీవితాంతం రాళ్లు పోగేస్తూనే ఉన్నాడు.కాకపోతే అవి కిడ్నీలో పోగు చేశాడు. ఇప్పడవి మొత్తం 300లకు చేరాయి. వాటన్నింటినీ తీయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు.ఈ అరుదైన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన రాంరెడ్డి(75) వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ వృద్ధుడి కుడి వైపు కిడ్నీలో 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో రాయి ఉన్నట్టు గుర్తించారు.
రాళ్ల కలయిక అంతా కలిసి ఒక పెద్దగా రాయిగా తయారైనట్టు పరీక్షల్లో తేలింది.కాగా లేజర్ టెక్నాలజీ సహాయంతో ఆ రాయిని బ్లాస్ట్ చేసి కీ హోల్ సర్జరీ చేసి కిడ్నీలోంచి మొత్తం 300 రాళ్లను వెలికి తీశారు.హైటెక్ సిటీలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు ఈ సర్జరీ చేశారు.రాంరెడ్డికి డయాబెటిస్,హైపర్ టెన్షన్,గుండె సంబంధిత జబ్బులు వంటి సమస్యలు ఉన్నాయని కానీ తమ టీమ్ అతడికి శస్త్ర చికిత్స చేసి 300 రాళ్లు వెలికి తీశారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.సర్జరీ అయిన తరువాత రెండు రోజులకు పేషెంట్ ని డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తక్కువగా తాగు నీరు తీసుకోవడం వల్లే కిడ్నీలో రాళ్లు తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు.