నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభం
హైదరాబాద్ Hyderabad : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహం.దేశంలో ఇప్పటి వరకూ ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తులో విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ , రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.హుస్సేన్‌సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్
హైదరాబాద్ Hyderabad : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర, ఆయన జాతికి అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
అడ్డుంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనం అని పేర్కొన్నారు. ఎంతటి పనైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యం చేరుకోవడం ఖాయం. కుల వివక్ష, అంటరానితనం పట్ల ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేద్కర్ అని కొనియాడారు.ఆత్మనూన్యతకు, దుర్భలత్వానికి లోనుకాకుండా గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని కేసీఆర్ పేర్కొన్నారు.
సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, వర్ణ వివక్షత, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు ఆలోచింపజేశాయి. అసమానతలు లేని ఆధునిక భారతాన్ని ఆవిష్కరించేందుకు అన్ని వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్. తన మేధస్సుతో మదించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చారు. నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.