తాండూర్ లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్
తాండూర్ Tandur : వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన నిమిషాల్లోనే ప్రశ్నపత్రం బయటకు రావడం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ ఉపాధ్యాయుడే పేపర్ బయటకు రావడానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మండల విద్యాధికారి (ఎంఈవో) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
‘‘తాండూర్‌లోని ఒకటవ ప్రభుత్వ పాఠశాలలలో సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమైంది. 9.37 నిమిషాలకు పాఠశాలలో పనిచేసే బందెప్ప అనే బయోసైన్స్ ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రాన్ని తన మొబైల్ ద్వారా ఫొటో తీసి ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. తర్వాత వెంటనే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసినప్పటికీ.. గ్రూప్‌లో ఉన్న మిగతా సభ్యులు ఇతరులకు షేర్ చేశారు. వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతున్నట్లు ఎంఈవోకు 11 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే ఎంఈవో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన పోలీసులు బందెప్ప కారణంగానే ప్రశ్నపత్రం లీకైనట్లు గుర్తించారు’’ అని కలెక్టర్ తెలిపారు.పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురు శివ కుమార్,గోపాల్,బందప్ప,సమప్ప వీళ్లని సస్పండ్ చేసినట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అదేశం
పరీక్ష సమయం పూర్తవకముందే పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిని విద్యాశాఖ ఆదేశించింది. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ వారిని పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.